ఓరుగల్లు నగారా
గణపతి దేవుడి పట్టపుటేనుగు
మదమెక్కి కదనరంగమున కదంతొక్కింది
రాణి రుద్రమ వీరఖడ్గము
ధగధగ మెరిసి భగభగ మండింది
బమ్మెర పోతన భాగవతంబు
అభ్యుదయంతో ఏకీభవించింది
భధ్రకాలీ,పద్మాక్షమ్మా,గోవిందరాజులు
కొండంత ధైర్యము గుండెలనిండా నింపిరి!
కోటలు నిలిపిన సంగ్రామాలకు
కాంతులు జల్లిన సాహిత్యాలకు
కానుపు పోసిన కన్నతల్లి
కాకతీయుల కంటి వెలుగు,
నా ఓరుగల్లు నగారా మోగింది!
విప్లవాలకు, ఉద్యమాలకు
ఊపిరి పోసిన ఊరు ఇదేలే!
సాంఘిక, పౌరాణిక చరిత్ర ల
సాక్షిగ నిలిచిన గడ్డ ఇదేలే!
జానపదాలను జ్ఞానపదానికి
నిండుగ చేర్చిన నగరమిదేలే!
విద్యారణ్యుని విజ్ఞాన ధనాన్ని
విప్రుల కొసగిన వేదికిదేలే!
బతుకమ్మ, బోనాల పండుగల,
సమ్మక్క సారక్క జాతరల,
ప్రజల ప్రభంజన ప్రచండముగ
ప్రపంచమంతా వినిపిస్తుండగ
నా ఓరుగల్లు నగారా మోగింది!
-సిధ్ధార్థా పాములపర్తి
ఆగష్టు ౧౮, ౨౦౦౮.
Comments