The Gardener- translations
# 40
నీకింక సెలవు చెప్పాలని నేనొచ్చిన ప్రతీసారీ
నీ కండ్లు ఊహించనంత సోయగంతో నవ్వుతాయి.
ఎన్ని మార్లో కదా నా ఈ విన్యాసం ?
మళ్లీ వస్తాననేగా నీ నమ్మకం ?
నిజానికి నాకూ అదే అనుమానం!
వసంతం ప్రతి యేడాదీ వచ్చినట్టు
పౌర్ణమి చంద్రుడు వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వచ్చినట్టు
అందమైన పూవులు చెట్టు కొమ్మల పై
శ్వాస వదిలి - మరల విరగబూసినట్టు
నేనూ మళ్లీ నీ దగ్గరకొచ్చి సెలవు తీసుకుంటానేమో?
ఈ మాయను ఇలాగే ఉండనీ కాసేపు!
త్వరపడి తరిమివేయకు దానిని..
నేను నీకు వీడ్కోలు చెప్పిన ప్రతీ సారీ అదే నా ఆఖరి చూపనుకో
నీ కను అంచులలో కారు మబ్బులు తెచ్చే వాన జల్లులు నిండనీ…
నేను తిరిగి రాగానే,
నీ పెదవులు విప్పి నవ్వి ఆనందిద్దువుగానీ !
(From Rabindranath Tagore’s original English)
Comments