The Gardener Translations - Contd
#41
నేను ఎన్నో లోతైన విషయాలని నీకు వివరించాలనుకున్నా
కానీ నువ్వు నవ్వుతావేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా
అందుకే నా పైన నేనే చమత్కరిస్తూ నా రహస్యాన్ని దాచేస్తున్నా
నువ్వు చిన్నచూపు చూస్తావేమోనని నా బాధని నేనే చులకన చేస్తున్నా
నేను నిజాయితీగా ఉన్న మాట చెబుదామనుకున్నా
కానీ నువ్వు నమ్మవేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా
అందుకే గారడీ చేసి నా ఆలోచనలని అభద్దాలుగా మార్చేస్తున్నా
నువ్వెక్కడ హేళన చేస్తావేమోనని నా బాధను నేనే వింతగా వెక్కిరిస్తున్నా
నేను నీ గురించి పసిడి వన్నెలతో నిండిన పద విన్యాసాలతో పొగడాలనుకున్నా
కానీ వాటి విలువ కట్టలేక నీరు కారుస్తావేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా
అందుకే నిన్ను పరుష పదాలతో దూషిస్తూ నా దుర్బల ప్రదర్శన చేస్తున్నా
నిన్ను నొప్పించి నేను మాత్రం తప్పించుకుంటున్నా
నేను నీ ఎదురుగా నిశ్శబ్దంగా కూర్చోవాలనుకున్నా
కానీ మనసులో మాట బయట పడుతుందని ధైర్యం చెయ్యలేకపోతున్నా
అందుకే తోచిందేదో వాగి నా హృదయ ప్రతిబింబాన్ని చెల్లా చెదురు చేస్తున్నా
నీ కఠిన హృదయానికి భయపడి నా బాధను నేనే అణిచేస్తున్నా
నీ నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నా
\కానీ నా పిరికితనం నీకు తెలిసిపోతుందని ధైర్యం చెయ్యలేకపోతున్నా
అందుకే తలపైకెత్తి గర్వంగా నీ ముందు నిలిచుంటున్నా
నిరంతరాయంగా కదులుతున్న నీ కన్నులు
శ్రుష్టిస్తున్న కొత్త కొత్త బాధలలో
మునిగి ఈదుతూ
తరిస్తున్నా
తపిస్తున్నా
(From Rabindranath Tagore’s original English)
Comments