Posts

Showing posts from November, 2023

The Gardener Translations - Contd

 #41 నేను ఎన్నో లోతైన విషయాలని నీకు వివరించాలనుకున్నా  కానీ నువ్వు నవ్వుతావేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా  అందుకే నా పైన నేనే చమత్కరిస్తూ నా రహస్యాన్ని దాచేస్తున్నా  నువ్వు  చిన్నచూపు చూస్తావేమోనని నా బాధని నేనే చులకన చేస్తున్నా  నేను నిజాయితీగా ఉన్న మాట చెబుదామనుకున్నా   కానీ నువ్వు నమ్మవేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా అందుకే గారడీ చేసి నా ఆలోచనలని అభద్దాలుగా మార్చేస్తున్నా  నువ్వెక్కడ హేళన చేస్తావేమోనని నా బాధను నేనే వింతగా వెక్కిరిస్తున్నా  నేను నీ గురించి పసిడి వన్నెలతో నిండిన పద విన్యాసాలతో పొగడాలనుకున్నా కానీ వాటి విలువ కట్టలేక నీరు కారుస్తావేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా అందుకే నిన్ను పరుష పదాలతో దూషిస్తూ నా దుర్బల ప్రదర్శన చేస్తున్నా  నిన్ను నొప్పించి నేను మాత్రం తప్పించుకుంటున్నా నేను నీ ఎదురుగా నిశ్శబ్దంగా కూర్చోవాలనుకున్నా  కానీ మనసులో మాట బయట పడుతుందని ధైర్యం చెయ్యలేకపోతున్నా అందుకే తోచిందేదో వాగి నా హృదయ ప్రతిబింబాన్ని చెల్లా చెదురు చేస్తున్నా  నీ కఠిన హృదయానికి భయపడి నా బాధను నేనే అణిచేస్తున్నా నీ నుంచి దూరంగా...

The Gardener- translations

 # 40 నీకింక సెలవు చెప్పాలని నేనొచ్చిన ప్రతీసారీ నీ కండ్లు ఊహించనంత సోయగంతో నవ్వుతాయి. ఎన్ని మార్లో కదా నా ఈ విన్యాసం ? మళ్లీ వస్తాననేగా నీ నమ్మకం ? నిజానికి నాకూ అదే అనుమానం! వసంతం ప్రతి యేడాదీ వచ్చినట్టు పౌర్ణమి చంద్రుడు వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వచ్చినట్టు అందమైన పూవులు చెట్టు కొమ్మల పై  శ్వాస వదిలి - మరల విరగబూసినట్టు నేనూ మళ్లీ నీ దగ్గరకొచ్చి సెలవు తీసుకుంటానేమో? ఈ మాయను ఇలాగే ఉండనీ కాసేపు! త్వరపడి తరిమివేయకు దానిని.. నేను నీకు వీడ్కోలు చెప్పిన ప్రతీ సారీ అదే నా ఆఖరి చూపనుకో నీ కను అంచులలో కారు మబ్బులు తెచ్చే వాన జల్లులు నిండనీ… నేను తిరిగి రాగానే,  నీ పెదవులు విప్పి నవ్వి ఆనందిద్దువుగానీ ! (From Rabindranath Tagore’s original English)